పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-03 ఆహిరి సం: 03-039 వైరాగ్య చింత

పల్లవి:

అయ్యో నా నేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచు చంచలాన మోసపోతిఁ గాక

చ. 1:

కాననా నావంటివారే కారా యీ జంతువులు
నానాయోనులఁ బుట్టి నడచేవారు
మానక నా గర్వమున మదాంధమున ముందు
గానక భయపడిన కర్మ నింతేకాక

చ. 2:


చదువనా నేఁ దొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నా భోగవాంఛలే పెంచిపెంచి
తుద కెక్క వెదకని దుష్టుఁడ నేను

చ. 3:


విననా నేఁ బురాణాల వెనకటివారినెల్ల
మనెడి భాగవతుల మహిమ లెల్లా
యెనయుచు శ్రీవేంకటేశు కృపచేత నేడు
ఘనుఁడ నయితిఁ గాక కష్టుఁడఁ గానా