పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-02 సామంతం సం: 03-038 అధ్యాత్మ

పల్లవి:

ఎందరితోఁ బెనఁగేను యెక్కడని పొరలేను
కందర్పజనక నీవే గతిఁ గాక మాకు

చ. 1:

నిక్కి నా బలవంతాన నే నే గెలిచేనంటే-
నొక్కపంచేంద్రియముల కోపఁగలనా
తక్కిన సంసారవార్థి దాఁటఁగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయఁగలనో

చ. 2:

పన్నుకొన్న పాయమున పరము సాధించేనంటే
యెన్న నీ మాయ కుత్తర మియ్యఁగలనా
వన్నెల నా మనసే పంచుకోఁగలనో మరి
కన్నట్టి యీ ప్రపంచమే కడవఁగఁ గలనో

చ. 3:

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేఁ జేసేనంటే
తొల్లిటి యజ్ఞానము తోయఁగలనా
ఇల్లి దే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుఁడ నౌదుగాక పంద నఁ గాఁగలనా