పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0264-01 శుద్ధవసంతం సం: 03-367 ఉపమానములు


పల్లవి :

కడనుండే విజ్ఞానికిఁ గా దిటువలెను
వొడలి రోఁతలు చూచి వూరకైనా నవ్వును


చ. 1:

ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే
జాఱని వేఁప చేఁదైనాఁ జప్పనై తోఁచు
వీఱిడై సంసారపువిష మెక్కినవానికి
చూఱలై హేయకాంతలు సుఖములై తోఁచును


చ. 2:

చెంగట వెఱ్ఱివానికి చేసిన చేఁతలెల్ల
తొంగలించి వివేకాలై తోఁచినట్లు
మింగుచుఁ గర్మపు నాము మేసిన సంసారికి
అంగడి కర్మమే బ్రహ్మమై తోఁచును


చ. 3:

జగమిది యొక్కటే చవులు వేరేవేరే
మొగి నెఱుకమఱపు ముడిచున్నది.
పగటు శ్రీవేంకటేశుఁ బట్టి కొలువనివాఁడు
తెగని మాయలలోనఁ దేలాడవలసె