పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0264-02 బౌళి సం: 03-368 శరణాగతి


పల్లవి :

నరహరి నీ దయమీఁదట నా చేఁతలు గొన్నా
శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా


చ. 1:

మొఱయుచు నరకపు వాకిలి మూసిరిహరినీదాసులు
తెఱచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు
నుఱిపిరి పాపములన్నియు నుగ్గుగ నిటు తూర్పెత్తిరి
వెఱవము వెఱవము కర్మపువిధులిఁక మాకేలా


చ. 2:

పాపిరి నా యజ్ఞానము పరమాత్ముఁడ నీదాసులు
చూపిరి నిను నామతిలో సులభముగా నాకు
రేఁపిరి నీపై భక్తిని రేయినిఁ బగలును నాలో
వోపము వోపము తపములు వూరకే ఇఁక నేలా


చ. 3:

దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీవేంకటేశ్వర
అద్దిరి నీదాసులు నీయానందములోన
ఇద్దరి నీనా పొందులు యేర్పరచిటువలెఁ గూర్చిరి
వొద్దిక నొద్దిక నాకిఁక నుద్యోగములేలా