పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0263-06 శ్రీరాగం సం: 03-366 వైరాగ్య చింత


పల్లవి :

ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు
మక్కళించి మక్కళించి మాయకింతాఁ దగులు


చ. 1:

పుట్టినప్పుడే పాపపుణ్యములు దగులు
అట్టె దేహమున కన్నమూఁ దగులు
గట్టిగా నీరెండూనై తే కర్మమూఁ దగులు
యెట్టునుఁ బోరాదు మాయకింతాఁ దగులు


చ. 2:

మనికి సంసారియైతే మమతలుఁ దగులు
పెనగఁగఁ బెనగఁగా బిడ్డలూఁ దగులు
అనువై యీలంపటాన కాసలెల్లాఁ దగులు
మన సొక్కటొక్కటై మాయకింతాఁ దగులు


చ. 3:

అరయ శ్రీవేంకటాశుఁ డాత్మలోనే తగులు
శరణన్నవారికి విజ్ఞానము దగులు
గరిమ నిందువల్లనే ఘన మోక్షమూఁ దగులు
మరిగినప్పుడే సుమ్మీ మాయకింతాఁ దగులు