పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0263-05 మాళవి సం: 03-365 ఉత్సవ కీర్తనలు


పల్లవి :

వీఁడు గదే శేషుఁడు శ్రీవేంకటాద్రి శేషుఁడు
వేఁడుక గరుడనితోఁబెన్నుద్దైన శేషుఁడు


చ. 1:

వేయివడిగెలతోడ వెలసిన శేషుఁడు
చాయమేని తళుకు వజ్రాల శేషుఁడు
మాయని శిరసులపై మాణికాల శేషుఁడు
యే యెడ హరికి నీడై యేఁగేటి శేషుఁడు


చ. 2:

పట్టపు వాహనమైన బంగారు శేషుఁడు
చుట్టు చుట్టుకొనిన మించుల శేషుఁడు
నట్టుకొన్న రెండువేలునాలుకల శేషుఁడు
నెట్టన హరిఁబొగడ నేరుపరి శేషుఁడు


చ. 3:

కదిసి పనులకె ల్లఁ గాచుకున్న శేషుఁడు
మొదల దేవతలెల్లా మొక్కే శేషుఁడు
అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును
పదరక యేపొద్దూ పానుపైన శేషుఁడు