పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0263-04 సాళంగనాట సం: 03-364 దశావతారములు


పల్లవి :

హరి యిచ్చిన వరము లటువలెఁ గావుగా
తిరమై వివేకులెల్లాఁ దెలిసేటి దిదియే


చ. 1:

శిరసులు తుంచితుంచి చిచ్చులోన వేలిచి
వరములు వడసె రావణుఁ డెన్నైనా
నిరతి రాముని చేత నిమిషములోననే
వరములన్నియు నెందో వరతిపాలాయ


చ. 2:

వీరఘోరతపముల వెలయ బాణాసురుఁడు
కోరి చేకొన్నవరాలు కోటానఁగోటి
వూరకే కృష్ణునిచేత నొక యిసుమంతలోనే
తోరమైన వరములు తుత్తునియలాయ


చ.3:

వట్టిజాలిఁ బొరలక వరుస విభీషణుఁడు
జట్టిగ రఘుపతికి శరణనెను
నెట్టన నాతనిఁ గాచె నేఁడూ నున్నాఁడదె
యిట్టే శ్రీవేంకటాద్రి నిచ్చీ వరములు