పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0262-06 శంకరాభరణం సం: 03-360 వైష్ణవ భక్తి


పల్లవి :

మానుప వశమా మాయ లివిన్నియు
శ్రీనాథుఁడు మును సేసినవే


చ. 1:

రాతిరి చీఁకటి రతిఁ బగలు వెలుఁగు
ఘాతల నెప్పుడు గలదిదియే
యీతల జ్ఞానుల కిల నజ్ఞానుల
జాతివైరములు సహజములే


చ. 2:

అసురలకు సురల కనాది నుండియు
అసమున వైరంబది గలదే
యెసగి వైష్ణవుల కీలఁ బ్రాకృతులకు
పొసఁగని వాదము భువిఁ గలదె


చ. 3:

యిహమునుఁ బరమును యీలంకెలతో
విహితము చెప్పెడి వేదములే
అహిపతి శ్రీవేంకటాధిపు మతమిది
నిహితం బెఱిఁగిన నిశ్చలమే