పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0262-05 దేవగాంధారి సం: 03-359 గురు వందన, నృసింహ


పల్లవి :

పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు


చ. 1:

పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు


చ. 2:

కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు


చ. 3:

యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు