పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0262-04 దేసాళం సం: 03-358 విష్ణు కీర్తనం


పల్లవి :

ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము


చ. 1:

యెవ్వని పేరఁ బిలుతు రిలఁ బుట్టిన జీవుల
నవ్వుచు మాసనక్షత్రనామములను
అవ్వల నెవ్వని కేశవాదినామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు


చ. 2:

అచ్చ మే దేవుని నారాయణనామమే గతి
చచ్చేటివారికి సన్యాసమువారికి
ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము


చ. 3:

నారదుఁడు దలఁచేటి నామమది యెవ్వనిది
గౌరి నుడిగేటి నామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీ రీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము