పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0263-01 సామంతం సం: 03-361 వైరాగ్య చింత


పల్లవి :

ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు
వొక్కటి కొక్క బంధము వూహింప నెక్కుడు


చ. 1:

బుడిబుడి మాయలఁ బొరలేటి దేహికి
కడవరాని బంధము కాంతలు
యెడపడ కందుకంటే నెక్కుడైన బంధము
కడునాసఁ బొరలించు కనకము


చ. 2:

బాలులకు వృద్ధులకు పాయపు వివేకులకు
తేలించే బంధములు దినరుచులు
మూలనున్నాఁ బోనీదు ముంగిటనే వేసేది
వేళ గాచిన బంధము విద్యాగర్వము


చ. 3:

పాయ దేజంతువులైనాఁ బశుపక్షులకునైనా
బాయటి గీముల కట్టుఁబాటు బంధము
యేయెడ శ్రీవేంకటేశ ఇంక నీదాసులకైతే
చాయై చెప్పినట్టు సేసు సకలబంధములు