పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0262-01 దేవగాంధారి సం: 03-355 విష్ణు కీర్తనం


పల్లవి :

వినరో భాగ్యము విష్ణుకథ
వెను బలమిదివో విష్ణుకథ


చ. 1:

ఆదినుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధివీధులనే విష్ణుకథ


చ. 2:

వదలక వేద వ్యాసులు నుడిగిన-
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణుకథ


చ. 3:

గొల్లెతలు చల్ల గొనకొని చిలుకఁగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీవేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపే నీ విష్ణుకథ