పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0262-02 సాళంగనాట సం: 03-356 నామ సంకీర్తన


పల్లవి :

భవరోగవైద్యుఁడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో


చ. 1:

అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేని రతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో


చ. 2:

పొలఁతులనెడి మహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారు.
అలరు చెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో


చ.3:

తరుణుల కాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁ గారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదు సుఖాననుండే యంత్రమేదొకో