పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0260-02 రాయగౌళ సం: 03-344 శరణాగతి


పల్లవి :

ఇంతగాలమాయను యేడనున్నారో వీరు
వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు


చ. 1:

యేలేవారి దూరితి యెడరు పుట్టినవేళ
కాలమును దూరితిని కలఁగేవేళ
తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి
యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము


చ. 2:

దైవమును దూరితి తమకించినట్టివేళ
కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ
సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి
యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము


చ. 3:

 పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ
కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి
జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె
యిట్టె యింతటివారు యెవ్వరును లేరు