పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-03 గుండక్రియ సం: 03-033 అద్వైతము

పల్లవి:

ఇట్టి నాస్తికుల మాట యేమని నమ్మెడి దిఁక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు

చ. 1:

వేదములు చదువుతా విశ్వమెల్లాఁ గల్లనేరు
ఆ దెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగు విష్ణుడుండఁగ బయలు తత్త్వమనేరు
లేదు జీవత్వమంటా లేమలఁ బొందుదురు

చ. 2:

తిరమై తమఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముఁ దామే దైవమనేరు
అరయఁ గర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు

చ. 3:

అందుక పురుషసూక్త మర్థముఁ జెప్పుదురు
కందువ నప్పటి నిరాకార మందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుఁ గాక
మందపు రాక్షసులాడే మతము నడతురు