పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-02 దేవగాంధారి సం: 03-032 అధ్యాత్మ

పల్లవి:

దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక
జీవుల వసము గాదు చిక్కిరి లో లోననే

చ. 1:

పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటి వరదవలె నానాటి నీ మాయ
కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము

చ. 2:

పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల
కాఁపురపు విధులలో కలకాలము
తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా
మాపురేపు ముంచఁజొచ్చె మతిలోని ధైర్యము

చ. 3:

లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపుకోరికెల కలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి