పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-04 వసంతవరాళి సం: 03-034 వైష్ణవ భక్తి

పల్లవి:

ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక
అహిశయనుని దాసులంతవారు వేరీ

చ. 1:

సిరి కలిగినవారు చింతలిన్నిటనుఁ బాసి
నిరతపు వర్గ(గర్వ?) ముతో నిక్కేరటా
సిరికి మగఁడయిన శ్రీపతి యేలి మ-
మ్మరయుచునున్నాఁడు మా యంతవారు వేరీ

చ. 2:

బలవంతుఁడైనవాఁడు భయము లిన్నిటఁ బాసి
గెలిచి పేరు వాడుచుఁ గెరలీనటా
బలదేవుఁడైన శ్రీపతి మా యింటిలోన
అలరి వున్నాఁడు మా యంతవారు వేరీ

చ. 3:

భూము లేలేటివాఁడు భోగములతోఁ దనిసి
కామించి యానందమునఁ గరఁగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుఁడు మాకు
ఆముకొనివుండఁగా మాయంతవారు వేరీ