పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0257-02 లలిత సం: 03-327 వైరాగ్య చింత


పల్లవి :

పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా


చ. 1:

కామినులఁ జూచిచూచి కన్నులఁ గొంతపాపము
వేమరు నిందలు విని వీనులఁ గొంతపాపము
నామువారఁ గల్లలాడి నాలికఁ గొంతపాపము
గోమునఁ బాపము మేనఁ గుప్పలాయ నివిగో


చ. 2:

 కానిచోట్లకు నేఁగి కాఁగిళ్ళఁ గొంతపాపము
సేన దానాలందుకొని చేతులఁ గొంతపాపము
మానని కోపమే పెంచి మతిఁ గొంతపాపము
పూని పాపములే నాలోఁ బోగులాయ నివిగో


చ. 3:

చేసినట్టివాఁడఁగాన చెప్ప నీకుఁ జోటులేదు
దాఁసుడ నే నైతిఁ గొన దయ దలఁచితివయ్య
యీసరవులెల్లఁ జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయఁబోయఁ బనులు