పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0257-03 వరాళి సం: 03-328 వైరాగ్య చింత


పల్లవి :

కలిమిలేములెల్లా కాలము స్వభావము
తలఁపులో జ్ఞానము దక్కెడి దొకటే


చ. 1:

పుట్టుగులు జీవునికి పూఁచిన స్వభావము
వొట్టి యిదె సారెసారె వోమనేలా
పట్టి నానాఁటి బ్రదుకు ప్రపంచము స్వభావము
కొట్టగొన హరిముక్తి గోరెటిదొకటే


చ. 2:

మక్కువ సంసారము మాయలస్వభావము
చిక్కి కన్నవారికెల్లా మొక్కుకోనేలా
తక్కక రక్షించేది దైవము స్వభావము
నిక్కపు వైరాగ్యము నిలుచుట వొకటే


చ. 3:

కప్పిన భోగములెల్లా కర్మము స్వభావము
తప్పక ప్రియము చెప్పే దైన్యమేలా
యెప్పుడు శ్రీవేంకటేశ యెదలో నాకుఁ గలవు
చప్పుడుసేయక నీకు శరణనే దొకటే