పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0257-01 సాళంగనాట సం: 03-326 కృష్ణ


పల్లవి :

ఎక్కడిది వివేకమెంతవారికి నియిన్నియునీమాయఁదోయకలేదు
పక్కన అజ్ఞానపుజీవుల యీపాప మిట్లనే వుండఁగను


చ. 1:

విచ్చనవిడి నటు కౌరవులెదుటను విశ్వరూపు చూపినయపుడు
యిచ్చల నిను నమ్మఁగలేకేకా యింద్రజాలమనిరి
తచ్చన నిప్పటి నాస్తికజనులును తగు నీ సాకారము చూచి
నిచ్చలుఁ గల్లని నిరాకారము నిజమని తర్కించక మానుదురా


చ. 2:

గరుడవాహనము శంఖచక్రములు కనియుండియు ద్వాపరజనులు
ధరలో నిను హరిమూర్తెని తెలియక తమయాదవుఁడొకఁ డితఁడనిరి
సరుస దేవతాంతరములఁ గొలిచేటి చంచలచిత్తులు ఇఁక నిన్నే
పరదైవం బననేరరు సరిగా బ్రహ్మాదులలో నొకఁడవందురు


చ. 3:

యెఱిఁగిన దాసులు యెఱుఁగుదురు నీ వెక్కుడనుచు యేకాలమును
యెఱఁగని పామరు లెఱఁగరు నిను మతినెంతైనా నాఁడు నేఁడును
తఱితో శ్రీవేంకటేశ్వర నినుఁ గని తగు శరణాగతులున్నట్లు
మఱుఁగుననుండిన ప్రాకృతులకు నీమహిమలుగానఁగఁదరమవునా