పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0247-04 కన్నడగౌళ సం: 03-269 శరణాగతి

పల్లవి:

ఈయపరాధములు సహించవయ్యా
పాయక మమ్ము రక్షించేపని నీదే కాదా

చ. 1:

ఆకడ నీకడ మాలో నంతర్యామివి నీవు
నీకుఁ జేసే విన్నపాలు నీవెరఁగవా
పైకొని వోరువలేక పదరితి మింతేకాక
రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా

చ. 2:

ఱట్టు కెక్కి దాసుల మఱవక రక్షించే నీవు
గుట్టుతో మమ్ము వహించుకొనకుండేవా
పట్టలేక వేగిరించి పైపై దూరితిమిఁ గాక
ఇట్టే మాకీ సిరులు నీవిచ్చినవే యెపుడు

చ. 3:

యిదె శ్రీవేంకటేశ మమ్మేలినవాఁడవు నీవు
వదలకుండ నీవు నావాఁడవే కావా
అదన మన్నించఁగానే ఆసఁజే చాఁచితిఁగాక
చెదరక నాఁడే నాకుఁ జేతిలోనివాఁడవు