పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0247-05 నారాయణి సం: 03-270 అంత్యప్రాస

పల్లవి:

ఇందాఁకా వచ్చెఁ జేఁతలు యిఁకనో బుద్ధి
యెందుకు నీవే కర్తవు యిఁకనో బుద్ధి

చ. 1:

పుట్టితి నీయాజ్ఞను భుజించితిఁ గర్మమెల్లా
ఇట్టె జీవుఁడ నాకు నిఁకనో బుద్ధి
కట్టుకొంటి సంసారము కలిగెఁ బంచేంద్రియాలు
యెట్టనెదిటి పనుల కిఁకనో బుద్ధి

చ. 2:

వున్నాఁడ నీమాయలోనె వొట్టుకొంటి ఆసలెల్లా
యెన్నికె యీప్రాణికి నిఁకనో బుద్ధి
పన్నుకొంటి సంపదలు పంచభూతాల లోనైతి
యిన్నిటా నీపంపుననే యిఁకనో బుద్ధి

చ. 3:

భూమిపై నన్నేలితివి భోగములకు గురైతి
యేమనేవు యీదేహి కిఁకనో బుద్ది
శ్రీమంతుఁడ విన్నిటాను శ్రీవేంకటేశ్వర నీవు
యీమహిమలెల్లా నీవే యిఁకనో బుద్ధి