పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0247-02 సామంతం సం: 03-267 శ్రీహరి పరివారము

పల్లవి:

దాసవర్గముల కెల్లా దరిదాపు మీరె కాన
వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును

చ. 1:

సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా
శ్రీనాథునికి నేము సేసే విన్నపము
ఆనుక భాష్యకారులు అట్టే మీరుఁ జేయరాదా
మానక విన్నపము మా మనవి చనవులు

చ. 2:

వేయినోళ్ల భోగి నీవు విన్నపము సేయరాదా
వేయేసి మా విన్నపాలు విష్ణునికిని
ఆయితమై గరుడఁడ అట్టే మీరుఁ జేయరాదా
యేయెడ విన్నపము మా కేమి వలసినాను

చ. 3:

దేవులమ్మ యిందిర మాదిక్కై విన్నవించరాదా
శ్రీవేంకటపతికి చిత్తమందను
ఆవేళ శేషాచలమ అట్టే మీరుఁ జేయరాదా
యీవేళ మా విన్నపము లీడేరె నిఁకను