పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0247-01 దేసాక్షి సం: 03-266 దశావతారములు

పల్లవి:

నీదాసుల భంగములు నీవు చూతురా
యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా

చ. 1:

పాలసముద్రముమీఁద బవ్వళించినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టినయట్టు
వేళతో మా మనవులు విన్నవించితిమి నీకు
యేల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాదా

చ. 2:

ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు
బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు
ఘోరపు రాజసభలఁ గుంది విన్నవించితిమి
యే రీతి పరాకు నీకు నిఁక రక్షించరాదా

చ. 3:

యెనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు
పెనఁగి గజము మొరవెట్టినయట్టు
చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి
విని శ్రీవేంకటేశుఁడ వేగ రక్షించరాదా