పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0246-01 దేసాక్షి సం: 03-260 శరణాగతి

పల్లవి:

ఎటువంటి వెఱ్ఱినో యేమని విన్నివింతును
ఘటనలు నావంటా గర్వింతునయ్యా

చ. 1:

తలఁచే తలఁపు నీది తనువు నీ విచ్చినది
నిలిచిన జగమెల్లా నీ మయము
వలవంత నే నిందులో వట్టియహంకారినై
తెలియక నేనేయంటాఁ దిరిగేనయ్యా

చ. 2:

సేసేచేఁత నీయాజ్ఞ చిత్తమెల్లా నీయిచ్చ
రాసుల కర్మములు నీరపములివి
ఆసపడి నే నిందులో అన్నియు నావనుచును
పోసరించి మాయలలోఁ బొరలెదనయ్యా

చ. 3:

ఇహము నీవినోదమే యెన్నఁ బరము నీసొమ్మే
సహజము నీకు మాలో చైతన్యాలు
మహిలో శ్రీవేంకటేశ మరి నీదాఁసుడనైతి
బహుభక్తి నీమీఁదఁ బచరించేనయ్యా