పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0246-02 లలిత సం: 03-261 భక్తి

పల్లవి:

ఇందరు నెఱుఁగుదు రీయర్థయే భువి
కందువఁ దగులుట కర్మము కొలఁది

చ. 1:

ఆదికి ననాది హరిదాస్యంబిది
వేదాంతంబుల వెలసినది
సోదించి కనిరి శుకనారదాదులు
పాదుగఁ నిఁకఁ దమ భాగ్యముకొలఁది

చ. 2:

అతిరహస్యమిది అచ్యుతుపై భక్తి
ప్రతిలేని పరమపావనము
చతురులై తెలిసిరి సనకాది మునులు
తతి దొరకుట సుకృతఫలము కొలఁది

చ. 3:

పరము శ్రీవేంకటపతి సంకీర్తన
సొరిది గురుఁడొసఁగు సూక్ష్మమిది
చిరపుణ్యులు మును చేకొన్న నిజమిది
మరిగి మనుట తమ మనసుల కొలఁది