పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-06 సామంతం సం: 03-259 నామ సంకీర్తన

పల్లవి:

ఇంతకంటె ఘన మిఁక లేదు
సంతతసౌఖ్యము జనార్దనుఁడే

చ. 1:

భయనివారణము పరమాత్ముని నుతి
జయకారణ మీశ్వరచింత
అయుతపుణ్యఫల మచ్యుతునిసేవ
క్రియతో నిజ మెరిఁగినవారికిని

చ. 2:

కర్మహరము శ్రీకాంతు దరిశనము
ధర్మరాసి మాధవుశరణు
అర్మిలి సంపద లనంతుని తగులు
నిర్మలముగఁ బూనిన దాసులకు

చ. 3:

ఆగమోక్తమీ హరికైంకర్యము
భోగము విష్ణునిపూజ యిది
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు
బాగులు నేర్చిన ప్రపన్నులకును