పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-03 పాడి సం: 03-256 అధ్యాత్మ

పల్లవి:

వారివారి సహజపు వరుస లివి
కారణము తొల్లే హరికల్పితమిది

చ. 1:

వేరే విరుద్ధము లేదు వివేకించి చూచితేను
శూరుఁడై వుండిన మహాసుజ్ఞానికి
యేరీతిఁ జూచినాను యేకసమ్మతి లేదు
సారము దెలియరాని సంసారికి

చ. 2:

సకలభావములును చక్కనయ్యే తోఁచివుండు
ప్రకటించి నేరిచిన ప్రౌఢలకును
అకటా జగడములే అన్నిటా వెంటనే వచ్చు
వికలులైన మూఢవిచారులకు

చ. 3:

సేయఁగల కర్మమెల్లా సేసి తొల్లె ఫలించెను
దాయిదండగల హరిదాసులకును
రాయడిఁ బుణ్యపాపాలు రారాఁపులై యుండు
యేయెడ శ్రీవేంకటేశు నెరఁగనివారికి