పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-02 సామంతం సం: 03-255 వేంకటగానం

పల్లవి:

హరియే యెరుఁగును అందరి బ్రతుకులు
యిరవై యీతని యెరుఁగుటే మేలు

చ. 1:

వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజకీటముల మరెవ్వఁ డెరుఁగు

చ. 2:

ఆసఁ దొల్లి మును లనంతకోట్లు
చేసిరి తపములు సేనలుగా
యే సిరులందిరి యెరఁగ రెవ్వరును
వేసపు నరులకు విధి యేదో

చ. 3:

కల వనేకములు కర్మమార్గములు
పలుదేవత లిటు పాటించిరి
బలిమి శ్రీవేంకటపతికి మొర ఇడి
వెలసిరి తుదనిదే వెరవిందరికి