పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-01 గుజ్జరి సం: 03-254 అధ్యాత్మ

పల్లవి:

వెనుబల మైననుఁ గావఁగ వేరీ విష్ణు డొఁకడేకాక
అనుమానములన్నియు నుడిగితిని అలసితి నిఁక నేను

చ. 1:

పట్టిన చలము మానదు ప్రకృతి స్వతంత్రమున
పెట్టేడి మాయలనే కమ్మర పెట్టదు వివేకము
వుట్టితి నిన్నాళ్లాయను పొదలితి బుద్ధెరిఁగి
దిట్టనై అదికాదని తోసేటి దీమనమూ లేదు

చ. 2:

తగిలెడి అనుబంధము మానదు తలఁపను నొకవంక
తెగనియ్యదు కర్మము లేమిటిని తెగించుఁ బుణ్యముల
నగుచునే ముదిమికి లోనైతి నానాఁటికి నేను
మగటిమి నే దాని నణఁచను మరిగెడిదేకాని

చ. 3:

చేసిన అలవాటు మానఁడు జీవుఁడు తనగుణము
వేసరదు అనుభవించుటకు వేసరు ముక్తికిని
దాసునిఁగా శ్రీవేంకటేశుఁడు దయఁజూచెను నను నీవేళ
మోసములన్నియును దేరెను మునుపు వెనక యేదో