పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0242-02 బౌళి సం: 03-240 వేంకటగానం

పల్లవి:

దేవా నీవే యిన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి
యేవలనైనా నీవేకాక భువి నింతటివారలు యిఁకఁ గలరా

చ. 1:

జనులకు నీవే వొక్కొకచోటను శాస్త్రార్థములై కడఁగుదువు
తనియక నీవే మరి వారికి బొధకులఁ గొందరినిఁ గల్పింతువు
మనసులో నంతలో వొడఁబడికె చేసి మలయుచు నీవే నిలుతువు
కనుఁగొన నీవే సుజ్ఞానమార్గము కైవసముగాఁ దెలుపుదువు

చ. 2:

కడఁగి యప్పటి నివే యజ్ఞాదికర్మఫలములై వుండుదువు
తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు
యెడయక నీవే తపోమహిమలై యెదుటనే తార్కాణ లౌదువు
వొడలై నీవే యిహపరములకును వొడిగట్టి సాధింపింతువు

చ. 3:

ఆవేళ నీవే తత్త్వనిర్ణయము నాధారమునై యేర్పరతువు
నీవే కమ్మటి ఆచారవిధులకు నియమములెల్లా నేర్పుదువు
భావింప నీవే అలమేల్మంగకుఁ బతివై శ్రీవేంకటేశ రక్షింతువు
జీవుల కంతర్యామివై నీవే శిష్టులఁ బరిపాలింతువు