పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0242-03 ధన్నాసి సం: 03-241 వైష్ణవ భక్తి

పల్లవి:

విచారించుకోరో యిది వి???కులాల మెండు-
పచారాలు చూచి మీరు భ్రమయకురో

చ. 1:

భావింప నారదునికి బ్రహ్మపట్ట మరుదా
వేవేలైనాఁ గొంచెమని విడిచెఁగాక
దేవతలు తన్నుఁ జూచి దిగ్గన లేచి మొక్కేటి-
ఆవైభవపు పదమందెఁ గాక

చ. 2:

మిక్కిలి జ్ఞానము గల్గి మించి తమ నేరుపెల్లా
చిక్కి సంసారము పాలు సేయవలెనా
యెక్కువ హరిదాసుఁడై యిట్లానే వైకుంఠ-
మెక్కెడితోవ సాధించేదిది మేలుఁ గాక

చ. 3:

మూలమని నుడిగితే ముంచి యెవ్వఁడు గాచెను
పోలించ నెవ్వని నాభిఁ బుట్టె లోకాలు
చాలి యెవ్వనికుక్షి నీజగము లున్నవి మరి
కాలమందే ఆదేవునిఁ గానవలెఁ గాక

చ. 4:

యిదియే శ్రీవైష్ణవులు యిలఁ బూర్వాచార్యులు
వెదకి చదివి కన్నవివరమెల్లా
తుదమొద లెరఁగని దుష్టులకతలు మాని
పదిలమై యిట్టే నమ్మి బ్రదుకుటఁ గాక

చ. 5:

సంకుఁజక్రములు మాని సమానభోగముతోడ
అంకెల శ్రీవేంకటేశునండ నుండరో
పొంకపుబుద్ధు లిమ్మని పొంచి గాయత్రి జపించి
ఇంక బ్రహ్మవేత్త లెంచేదిందుకే కాక