పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0239-05 మాళవిగౌళ సం: 03-226 వేంకటగానం

పల్లవి:

ఇంద రెరిఁగినపని కిఁకఁ దప్పించుకోరాదు
పొందుగాని మాయలఁ బొరలఁగ నేఁటికి

చ. 1:

గతియై బ్రహ్మాండాలు కల్పించ నేరిచి
సుతులై బ్రహ్మాదులు చూపట్టఁగా
క్షితి వేదశాస్త్రాలచేతఁ బొగడించుకొంటా
నితరు లెరఁగకుండా నింత దాఁగనేఁటికి

చ. 2:

వున్నత పరమపద మొసఁగ నీవు గర్తవై
అన్నిటా లక్ష్మీనాథుఁడవనఁ బెంపొంది
పన్నుక యిన్నివిద్యలాఁ బ్రసిద్ధుఁడై వుండి
కన్నులకుఁ బ్రత్యక్షముఁ గాకుండ నేఁటికి

చ. 3:

సురల యాపదలెల్లా సులభాననె తీర్చి
పరగ ధర్మములెల్లాఁ బరిపాలించి
పరుషలకు వరాలు పలుమారుఁ గృపచేసి
మరిగి శ్రీవేంకటేశ మాటాడ వదేఁటికి