పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0240-01 సామంతం సం: 03-227 శరణాగతి

పల్లవి:

ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి

చ. 1:

పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
అట్టె వారి చరితలు ననేకములు
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు

చ. 2:

సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
దరినుండే వగరించి తమకింపుచుందురు

చ. 3:

వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
గడియించే పదార్థాలు కలవెన్నైనా
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలి(గి?)తే
జడియక నీదాసులు సంతసమందుదురు