పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0239-02 మలహరి సం: 03-223 అధ్యాత్మ

పల్లవి:

దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు
వూహించ నేర్చినవారలే వోరుచుకుందురయ్యా

చ. 1:

విడువవు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు
వెడవెడ మరణభయంబులు విడిచినయందాఁకా
వుడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు
పొడవగు విరక్తి తనలోఁ బొడమినయందాఁకా

చ. 2:

మానదు చిత్తవికారము మానదు దుర్గణదోషము
మానదు భోగము లన్నియు మానినయందాఁకా
పోనీదు సేసిన దురితము పోనీదు వ్రాఁతఫలంబును
పూనిన తన యజ్ఞానము పోయినయందాఁకా

చ. 3:

తెగవటు భవబంధంబులు తెగ వెడయని గర్వంబులు
నిగిడిన యీ యీత్మజ్ఞానము నీవిచ్చినయందాఁకా
జగదేకవిభుఁడ శ్రీవేంకటేశ్వర సర్వము నీయానతికొలఁదే
తగులుచుండు నివినిశ్చలముగ నీదాస్యము గలిగినయందాఁకా