పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0239-01 బౌలి. సం: 03-222 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

నీవొక్కఁడవే సర్వాధారము నిన్నేయెరిఁగిననన్నియు నెఱఁగుట
భావించి యింతయుఁ దెలియఁగ వలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు

చ. 1:

నీయందె బ్రహ్మయు రుద్రుఁడు నింద్రుఁడు నీయందె దిక్పాలకులు
నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వాఖ్యదేవతలు
నీయందె వురగులు యక్షరాక్షసులు నీయందె గరుఁడగంధర్వులు
నీయందె పితరలు సిద్ధసాధ్యులు నీయందె ద్వాదశాదిత్యులు

చ. 2:

నీవలననె కిన్నరకింపురుషులు నీవలననె విద్యాధరులు
నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు
నీవలననె గ్రహములు చంద్రుఁడును నీవలన(నె?) నభోంతరిక్షములు
నీవలననె జలధులు పవమానుఁడు నీవలననె గిరులును భూమియును

చ. 3:

నీలోననె నదులును నగ్నియు నీలోననె సచరాచరములును
నీలోననె వేదశాస్తము మొదలుగ నిఖిలశబ్దమయము
నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిది మతము