పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-06 భైరవి సం: 03-221 వైరాగ్య చింత

పల్లవి:

కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు
యిరవై నాలో నున్నాఁడ వేది గతి యిఁకను

చ. 1:

పేరుచున్నవి నాలోనఁ బెక్కు వికారములు
వూరుచున్నవెన్నైనా వూహలెల్లాను
చేరుచున్నవొక్కొక్కటే సేనాసేనకోరికలు
యీరీతి నున్నాఁడ నాకు నేది గతి యిఁకను

చ. 2:

పట్టుచున్నవి నానాప్రకృతుల వోజలు
పుట్టుచున్నవి యనేకభోగేచ్ఛలు
చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు
యిట్టివి నానడతలు యేది గతి యిఁకను

చ. 3:

సందడింపుచున్నవి సారెకు నా మమతలు
ముందువెనకై వున్నవి మోహాలెల్లా
చెందె నీపై భక్తి నేఁడు శ్రీవేంకటేశ్వర
యెందునూ నీవే కాక యేది గతి యిఁకను