పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-05 ముఖారి సం: 03-220 ఉపమానములు

పల్లవి:

పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము
విరసపు జాలిఁ జిక్కి వెతఁబడనోపము

చ. 1:

మగఁడు విడిచినా మామ విడువనియట్లు
నగి నామనసు రోసినా లోకులు మానరు
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు
మొగమోటలను నేను మోసపోవనోపను

చ. 2:

పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు
విసిగి నే విడిచినా విడువరు లోకులు
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు
పసలేని పనులకు బడల నేనోపను

చ. 3:

నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు
కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు
తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ
బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను