పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-04 సాళంగనాట సం: 03-219 శరణాగతి

పల్లవి:

నీవారైనవారికి నీపై భక్తేకాక
భావించ నేరక వట్టిభ్రమఁ బడవలెనా

చ. 1:

కరుణానిధి నీవు గలిగివుండఁగాను
తిరుమంత్రమే నాకు దిక్కయివుండఁగా
వరుస నాచార్యుఁడు వహించుక వుండఁగాను
పరగఁ దపము చేసి బడలఁగవలెనా

చ. 2:

కమలాక్ష నీముద్రలే కాచుక నాకుండఁగాను
అమరి దాస్యము కాణాచై వుండఁగా
తమితోడ వైష్ణవులు దాపుదండై వుండఁగాను
తెమలి తీర్థాలెల్లా ద్రిష్టించవలెనా

చ. 3:

శ్రీవేంకటేశ్వర నీసేవే గతియై యుండఁగా
ఆవటించి నుతి వుపాయమై వుండఁగా
తావులనే శరణనే ధర్మము రక్షించఁగాను
వేవేలు దానాలు చేసి వేఁడుకొనవలెనా