పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-03 ధన్నాసి సం: 03-218 అధ్యాత్మ

పల్లవి:

తప్పించుకోరా దిఁక దైవమే గతి
యెప్పుడు నుద్ధరించేవా రెవ్వరును లేరు

చ. 1:

మలసి దేహానందమే మరిగిన యాత్మకు
తొలుత బ్రహ్మానందము దొరకదు
అలవాటై క్షుద్రభోగాలందుఁ జిక్కిన యాత్మకు
బలిమి విరతిఁ బొంద బలపడదు

చ. 2:

సర్వదా బ్రహ్మాండములోఁ జరియించే యాత్మకు
నిర్వహించి వెడలఁగ నేరుపు లేదు
వుర్వి లోపలి చింతలుడుగని యాత్మకు
నిర్వికారభావము నెలకొనదు

చ. 3:

విరసవర్తనలనే వెలసేటి యాత్మకు
పరగఁ బేదలమీఁది భక్తి పుట్టదు
ధరలో శ్రీవేంకటేశుదాసుఁడుగాని యాత్మకు
వెర పేమిటా లేదు వెదకి చూచినను