పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-02 రామక్రియ సం: 03-217 అధ్యాత్మ

పల్లవి:

ఏలికె విందరికి యీ దేహభూమి నీది
మేలు అన్ని మట్టుపెట్టి మించరాదా జీవుఁడ

చ. 1:

వెలిఁబడ్డ యింద్రియాల వెలయ లోనికిఁ బిల్చి
కొలువులు సేయించుకొనరాదా
కలఁచెడి లోలోని కామాదిశత్రువుల
బెళకనీకడ్డపెట్టింపించరాదా జీవుఁడ

చ. 2:

అట్టే పరువుదోలిన ఆసలనే గుఱ్ఱముల
గట్టిగ లోలాయమునఁ గట్టుకోరాదా
వొట్టి యెదుట పౌఁజులై వుండిన భోగములను
ముట్టి యంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుఁడ

చ. 3:

పంపువెట్టి దండంపిన బలు నీ వుద్యోగాల-
గుంప గూర్చి ముక్తి చూరగొనరాదా
ఇంపుల శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త
సొంపుగ భావించి చక్కఁజూడరాదా జీవుఁడ