పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0238-01 కన్నడగౌళ సం: 03-216 అధ్యాత్మ

పల్లవి:

ఏమిసేతు నాభాగ్య మిట్లున్నది
నేమమేమీ నెరఁగను నీవే గతి యిఁకను

చ. 1:

అగపడి నిరంతర మలవాటైన జగత్తు
మొగమునఁ గట్టినట్టు మొగి మరవనీదు
తగిలి నిన్నెటువలె ధ్యానము సేతు నేను
అగడు సేసి సహాయముగాదు మనసు

చ. 2:

విడువక యెల్లప్పుడూ విడిదలైన దేహము
మెడఁ గట్టినట్టున్నది మెలఁగీ నురులదు
వొడయఁడ నీవూడిగె మొదిగి నేనెట్టు సేతు
అడరి కప్పిన నీ మాయాఁ దోడుగాదు

చ. 3:

వొద్దనే పెక్కుగాలము పూనిన పురాకృతము
చద్దిమూఁటై యనుభవించఁగఁ జేసీ మానదు
అద్దుక శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు
వొద్దికతో రక్షించు నావోజాఁ దోడుగాదు