పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0234-04 బౌళి సం: 03-195 దశావతారములు

పల్లవి:

ఇందుకే కాలమందే యీతని శరణంటిమి
ముందుముందే దయఁజూచి మొగిఁ గాచుఁగాక

చ. 1:

పుడమి గుంగిన నెత్తె పురుషోత్తముఁ డితఁడు
యెడసి కొండ గుంగితే నెత్తె నితడు
అడరి సంసారవార్ధి నడగిన దాసులను
యిడుముల బొందకుండా యెత్తి కాచుఁగాక

చ. 2:

పట్టి ప్రహ్లాదు బాధలు పాపిన దేవుఁ డితఁడు
రెట్టిగా వేదము లుద్ధరించె నితఁడు
వట్టి దుష్టులలో సహవాసమైతే దాసులను
దిట్టయై వెళ్లఁదీసి తా దిక్కై కాచుఁగాక

చ. 3:

లంకలో సీతఁ దెచ్చిన లావరి తానే యితఁడు
మంకు అహల్యశాపము మాన్పె నితఁడు
అంకెల శ్రీవేంకటేశుఁ డతిభీతిఁ బాపి మమ్ము
గొంకక తన దాసులఁ గూడి కాచుఁగాక