పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0234-03 సామంతం సం: 03-194 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమే రారో
దెసలఁ బేరటాండ్లు దేవుని పెండ్లికిని

చ. 1:

శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి
దైవికపుఁ బెండ్లిముహూర్తము నేఁడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

చ. 2:

కందర్పజనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి
పందిలిలోపలఁ దలఁబ్రాలు నేఁడు
గందమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

చ. 3:

అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును
మొదలి తిరుణాళ్లకు మొక్కేము నేఁడు
యెదుట నేఁగేరు వీరె యిచ్చేరు వరములివె
కదలి రారో పరుష ఘనుల పెండ్లికిని