పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0234-02 లలిత సం: 03-193 కృష్ణ

పల్లవి:

ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా

చ. 1:

చందురునుదయవేళ సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా

చ. 2:

వసుదేవుని యెదుట వైకుంఠనాథుఁడు
సిసువై యవతరించి చెలఁగీనమ్మా
ముసిముసి నవ్వులతో మునులకు బుషులకు
యిసుమంత వాఁడభయమిచ్చీనమ్మా

చ. 3:

కన్న తల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా