పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0234-01 సాళంగనాట సం: 03-192 అన్నమయ్య స్తుతి

పల్లవి:

నేనింత సేసినయట్టి నేరమి మరవవయ్య
ఆనుకొని తాళ్లపాక అన్నమయ్యఁ జూచి

చ. 1:

నావొళ్లి యపరాధా లెన్నక నిన్ను సారెసారె
వేవేలు దూరితి విచారించక
కావించి కన్నులలోని కళంకు దెలియలేక
ఆవలఁ జందురు నలుపణఁకించినట్లు

చ. 2:

పాయక నేఁ జేసినట్టి పాపము లెంచుకొనక
ఆయాలు మోవనాడితి నదివో నిన్ను
మాయల నాదేహమిది మలినమే తలఁచక
చాయ లేదని యద్దము సారెఁ దోమినట్లు

చ. 3:

మదమత్సరాలు నాలో మానకిట్టే వుండఁగాను
అదియే నీచేఁతంటా నాడుకొందును
యెదలో శ్రీవేంకటేశ యిరవై నీ వుండఁగాను
వెదకి వెదకి నీకే వెఱ్ఱిగొన్నయట్లు