పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0231-05 దేసాళం సం: 03-178 కృష్ణ

పల్లవి:

ఏమనఁగ వచ్చునమ్మ ఇటువంటి వారిఁ జూచి
కామించి గోపికలెల్లాఁ గాచుకున్నా రదివో

చ. 1:

రోలఁ గట్టుపడ్డవాఁడు రోఁకలి పట్టినవాఁడు
వేళలేదు వెన్నలెల్ల వెరఁజాడేరు
వేలఁ గొండెత్తినవాఁడు వేరే యేరుసేసేవాఁడు
బాలులవలెనే వీధిఁ బారాడేరు వారివో

చ. 2:

కాటుకమైచాయవాఁడు కప్పురపువన్నెవాఁడు
కూటము గూడుక జోడుకోడెలైనారు
నీటుఁ బైఁడికోకవాఁడు నీలికాశతోడివాఁడు
తేటలై దూడలఁ గాచి తిరిగేరు వారివో

చ. 3:

చేరి చీరలిచ్చువాఁడు చెలిఁ గుంగించినవాఁడు
ధీరులై రేపల్లెలోనఁ దిరిగేరదే
యీ రీతి శ్రీవేంకటాద్రి నిద్దరును నేకరూపై
కోరినవారి వరాలు కొల్లలిచ్చే రదివో