పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0231-04 దేసాక్షి సం: 03-177 వైరాగ్య చింత

పల్లవి:

వెఱ్ఱి దెలిసి మరియు వేఁదురు దవ్వేము నేము
ముఱ్ఱుఁబాల మంకువాఁడ మూలమా శరణు

చ. 1:

తోలు నెముకలు ముట్టి దోసమంటాఁ దీర్థమాడి
తోలు నెముకల మేనితోడ నున్నాఁడ
వాలిన జీవహింస వద్దని చైతన్యముతో
తేలించి శాకపాకాల దిగమింగేము

చ. 2:

బూతునఁ బుట్టినందుకు పుణ్యములెల్లాఁ జేసి
బూతుల సంసారమే భోగించేము
పాతకములెల్లాఁ బోను బహుదానము లొసఁగి
ఆతల నొరులఁ బోయి అడిగేము నేము

చ. 3:

కర్మము లన్నియుఁ దోసి ఘనముక్తిఁబొందేనంటా
కర్మాచలే కడుఁ జేసేము
నిర్మించి శ్రీవేంకటేశ నేరాలు నన్ను నెంచక
ధర్మము దలఁచి నీవే దయఁ జూడవే