పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0231-03 బౌళి. సం: 03-176 శరణాగతి

పల్లవి:

అమ్మే దొకటియును అసిమ లోనిదొకటి
ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా

చ. 1:

యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు

చ. 2:

పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతిఇంచేఅందుకును

చ. 3:

తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక నీవే కావవయ్యా