పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0231-06 పాడి. సం: 03-179 కృష్ణ

పల్లవి:

చేరి యందెలమోతతో చెన్నకేశవా
యీరీతి మాఁడుపూరిలో నిట్లాడేవా

చ. 1:

మున్ను యశోద వద్దను ముద్దు గునిశాడితివి
పన్ని రేపల్లె వీధులఁ బారాడితివి
పిన్నవై గోపాలులతోఁ బిల్లదీపులాడితివి
యెన్నిక మాఁడుపూరిలో యిట్లాడేవా

చ. 2:

కాళింగు పడిగెలపై కడు నాట్యమాడితివి
కేలి యమునలో రాసక్రీడలాడితి
చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి
యీలీల మాఁడుపూరిలో యిట్లాడేవా

చ. 3:

తగు విభాండకునితో దాఁగిలిముచ్చలాడితి
అగడుగా బండివిరిచాటలాడితి
వొగి శ్రీవేంకటగిరి నుండి వచ్చి మాఁడుపూర-
నెగసెగసి గతుల కిటులాడేవా (?)